కొపనాతి కృష్ణమ్మవర్మ గారి విగ్రహాష్కరణ హర్షణీయం:ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లురవీంద్ర
- 06/01/2015
మొగల్తూరు,
జనవరి 5: ప్రపంచ దేశాలలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది పుణ్య
క్షేత్రానికి మంచి పేరు, ప్రాముఖ్యత ఉందని, అటువంటి దేవాలయ నిర్మాత కొపనాతి
కృష్ణమ్మ విగ్రహం తన చేతుల మీదుగా ముత్యాలపల్లి గ్రామంలో ఆవిష్కరింపజేయడం
ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామం చింతరేవులో అంతర్వేది ఆలయ నిర్మాత
కొపనాతి కృష్ణమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
ఏర్పాటుచేసిన సభకు మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అంతర్వేది
నరసింహస్వామి వారి ఆలయానికి సూమారు 200 సంవత్సరాల క్రితం వంద ఎకరాల భూమిని
దానంచేసిన కొపనాతి కుటుంబ వారసులకు ఆలయం వంశపారపర్య హక్కు కల్పించేందుకు తన
వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంతర్వేది నరసింహస్వామి వారి
ఆలయ నిర్మాణానికి స్థల దానం చేసిన దాత కుటుంబ వారసులు ఎస్ ప్రసాద్,
శ్రీనివాస్‌లను మంత్రి రవీంద్ర అభినందించారు. ముత్యాలపల్లి గ్రామం
జిల్లాలోనే మంచి గుర్తింపు లభించే గ్రామంగా తీర్చిదిద్దుతానని మంత్రి హామీ
ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న ప్రజా సంక్షేమ
పథకాలు అవగాహన చేసుకునే స్థితిలో మత్స్యకారులు లేరని, విద్యాపరంగా
అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీర ప్రాంత
గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారి అభివృద్ధికి కృషిచేస్తున్నారని, దీని వల్ల
తీర ప్రాంత గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి పేర్కొన్నారు.
తొలుత వారతిప్ప గ్రామానికి చెందిన కొల్లాటి బాబూరావు ఆధ్వర్యంలో సుమారు 500
మంది పల్లవ సేన సభ్యులు మంత్రి రవీంద్ర కాన్వాయ్ ముందు బైకు ర్యాలీ
నిర్వహించారు. సమావేశానికి కొల్లాటి బాబురావు అద్యక్షుత వహించగా, నరసాపురం ఎమ్మెల్యే మాధవ నాయుడు, జడ్పీటీసీ
నాగరాజు, ఎంపిపి ముత్యాలరావు, వైస్ ఎంపిపి అండ్రాజ్ రామన్న, టిడిపి నాయకులు
బొమ్మిడి నాయకర్, అండ్రాజ్ చల్లారావు, మైల వీర్రాజ్, నరసాపురం ఎపిపి
నాగరాజు, మాజీ సర్పంచ్ కర్రి పుల్లయ్య, గ్రామ సర్పంచ్ కొపనాతి పల్లయ్య,
ముత్యాలపల్లి గ్రామ గాంధీ అధ్యయన కేంద్ర నిర్వాహకులు నాగిడి రాంబాబు
తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముత్యాలపల్లి గ్రామంలో బండి ముత్యాలమ్మ
అమ్మవారి జాతర మహోత్సవాలలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని అమ్మవారికి
ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ ఇవో మాచరాజు లక్ష్మీనారాయణ, ఉత్సవ
కమిటీ ఛైర్మన్ కర్రి పుల్లయ్య, సేవా కమిటీ సభ్యులు సాధనాల రాధాకృష్ణ, దాసరి
బాబి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈయన వెంట పలువురు టిడిపి నాయకులు
ఉన్నారు.